నా మౌనం చేతకాని తనం కాదు.. మోహన్ బాబు లేఖ వైరల్
Actor Manchu Mohanbabu open letter goes viral. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. నటుడు మోహన్ బాబు రాసిన లేఖ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
By అంజి Published on 2 Jan 2022 2:25 PM GMT'సినీ ఇండస్ట్రీలో పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకు అస్సలు వద్దు. ఓ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరానికి అండగా ఉంటా. అంతేకానీ అనవసర పంచాయతీలు నాకొద్దు. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా అండగా నిలబడతా 'అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. నటుడు మోహన్ బాబు రాసిన లేఖ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
'మనకెందుకు..మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకాని తనం కాదు..చేవలేని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్. కఠినంగా ఉంటాయ్..కానీ నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా..? సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు. కొన్ని వేల మంది ఆశలు. కొన్ని వేల కుటుంబాలు..కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట ఇది' అన్నారు.
'చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలుండాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి. ఇండస్ట్రీకి దేవుళ్లయిన నిర్మాతలు ఇప్పుడెక్కడున్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాదిపత్యం కాదు. అందరి జీవితాలతో ముడి పడి ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, మనుకున్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి..పరిష్కారం ఏంటి..ఏది చేస్తే సినీ పరిశ్రమకు మనుగడ ఉంటుందని చర్చించుకోవాలని' అంటూ మోహన్ బాబు సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్‌లో ఉంచారు. కాగా ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.