కళ జీవితాన్ని అనుసరిస్తుందంటారు. కరోనా విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. కరోనా వ్యాధి వచ్చిన తీరు, విస్తరిస్తున్న తీరు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తీరు చూస్తే చాలా మందికి పాత సినిమాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి. ఆ సినిమాల్లో చూపించినట్టుగానే కరోనా వ్యాధి వ్యాపిస్తోంది. సంఘటనలు కూడా అదేదో ఖచ్చితంగా సినిమాలో చూసినట్టే జరుగుతున్నాయి.

అందుకేనేమో కరోనా వ్యాధి ప్రబలిన తరువాత అంటువ్యాధుల వ్యాప్తిపై తీసిన సినిమాల జాబితాను గూగుల్ లో తెగ సెర్చి చేసేస్తున్నారు. టాప్ 25 అవుట్ బ్రేక్ ఫిలింస్, , టాప్ ఫిఫ్టీ అవుట్ బ్రేక్ ఫిలిమ్స్ ల కోసం సెర్చి ఇంజెన్లో వెతుకులాట 25 శాతం పెరిగింది. 2011 లో విడుదలైన కంటేజియ్ సినిమా కోసం గూగుల్ సెర్చి ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు గొట్టేస్తోంది. అంటువ్యాధులు, మహమ్మారుల మీద వచ్చిన ప్రధానమైన సినిమాలు ఇదిగో మీకోసం….

ఫ్లూ (2013)

ఈ సౌత్ కొరియన్ సినిమాలో హెచ్ 5 ఎన్ 1 వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. 26 గంటల్లో పేషెంట్లు చనిపోయేంత ప్రాణాంతక వ్యాధి ఇది. వలస వచ్చిన వ్యక్తి నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. గంటకు వేలాది మంది చొప్పు ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉంటారు.

క్యారియర్స్ (2009)

అంటువ్యాధులతో మానవాళి దాదాపు పూర్తిగా అంతరించి పోవడంతో సినిమా మొదలవుతుంది. మిగిలిన గుప్పెడు మంది ఆహారాన్ని, అత్యవసర వస్తువులను పోగు చేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలడంతో సినిమా మొదలవుతుంది. వ్యాధికి దూరంగా, సర్జికల్ మాస్కులు, ప్లాస్టిక్ క్లోతింగ్, జీ డీసీ ఇష్యూ గ్యాస్ మాస్కులు ధరించి ప్రజలు నివసించడం చూపిస్తారు.

ది హ్యాపెనింగ్ (2008)

ఈ సినిమాలో ప్రజలు పిట్టల్లా రాలిపోతూంటే, ప్లేగు వ్యాధి మనుషులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూంటే ఒక టీచర్, అతని భార్య, మరొక అమ్మాయిలు ఎలా గండం గడిచి గట్టెక్కుతారో చూపిస్తుంది. సంక్షోభ సమయంలో మానవాళి ప్రతి స్పందన ఎలా ఉంటుందో ఈ చిత్రం చూపిస్తుంది.

అయామ్ లెజెండ్ (2007)

క్యాన్సర్ ను తగ్గించేందుకు తయారు చేసిన ఒక వైరస్ వికటించి, మానవాళిని అంతం చేస్తుంది. ఈ వైరస్ ను తయారు చేసిన వైరాలజిస్టు ఒక్కడే ఈ రోగం బారిన పడకుండా ఉంటాడు. తనను తాను రక్షించుకుంటూ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అతను చేసిన కృషే ఈ చిత్రం. అతనిపై వైరస్ మ్యూటంట్లు దాడి చేస్తూ ఉంటాయి. దీనినుంచి తప్పించుకుంటూ ఉంటాడు.

పాండెమిక్ (2016)

ఒక వైరస్ విజృంభించి మానవాళిని నాశనం చేస్తుంది. ఒక డాక్టర్ మాత్రం దీనినుంచి తప్పించుకుని దానిని అరకట్టేందుకు పోరాడతాడు. ఈ సినిమాను వైద్యుడి కోణం నుంచి చూపించడం జరుగుతుంది.

ఆండ్రో మెడా స్ట్రెయిన్ (1971)

ఇది మైకేల్ క్రిష్టన్ నవల ఆధారంగా తీసిన సినిమా. అంతరిక్షంలోని ఒక గ్రహాన్ని గుర్తించి, దాని వల్ల విస్తరిస్తున్న వైరస్ ను అంతం చేసేందుకు ఒక మనిషి తన భుజాల మీద బాధ్యతను ఎత్తుకుంటాడు. ఇదొక సైంటిఫిక్ ఫిక్షన్ కమ్ థ్రిల్లర్ సినిమా.

మంకీస్ (1995)

టెర్రీ గిలియమ్స్ తీసిన 12 మంకీస్ చిత్రంలో వైరస్ సగం ప్రపంచాన్ని హరించి వేస్తుంది. కానీ జైలు శిక్షను అనుభవిస్తున్న ఒక వ్యక్తి విడుదలై దీనిని అంతం చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విల్ స్మిత్ ఈ సినిమాలో హీరో.

అవుట్ బ్రేక్ (1995)

ఈ చిత్రంలో ఒక చిన్న ఆఫ్రికన్ గ్రామంలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుంది. శాస్త్రవేత్తలు అత్యంత వ్యయప్రయాసలకోర్చి ఆ ప్రాంతానికి చేరుకుని వైరస్ విస్తరించకుండా చర్యలు చేపడతారు. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా తీశారు. డస్టిన్ హాఫ్ మన్, మోర్గన్ ఫ్రీమన్ ను ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు.

కంటేజియన్ (2011)

ఈ చిత్రం అత్యంత రియలిస్టిక్ తీశారు. వ్యాధి సార్స్ వ్యాధిని పోలి ఉంటుంది. ఇది విస్తరించిన వైనం, వ్యాప్తి చెందిన వైనం, దీని వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోయిన విదం అత్యంత వాస్తవ సమ్మతంగా తీశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విధానం ఈ సినిమాలో వైరస్ వ్యాప్తి చెందిన విదానం ఒకేలా ఉంటాయి. కరోనా లాగానే పర్యాటకుల వల్ల, ప్రయాణికుల వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కరోనా విషయంలో లాగానే వైరస్ ను లొకేట్ చేస్తేనే వ్యాక్సిన్ ను రూపొందించడం సాధ్యపడుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. రోగుల కోసం ప్రత్యేక క్యాంపులు, టెంట్లు, ప్రత్యేక భవనాలు ఏర్పాటవుతాయి. కంటేజియన్ సినిమాలో కరోనా లాగానే వైరస్ చైనా నుంచి వ్యాపిస్తుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.