విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
By అంజి
విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కుపైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
కోటా శ్రీనివాసరావు ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న జన్మించారు. 1978లో 'ప్రాణం ఖరీదు'తో నట ప్రవేశం చేశారు. ఇప్పటి వరకు ఆయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 750కుపైగా సినిమాల్లో నటించారు. విలన్, కామెడీ, తండ్రి, తాత, మామ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. ఆయన కెరీర్‌లో 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట చివరిసారిగా 'కబ్జా' మూవీలో నటించారు.
తన నటనతో తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచడంతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో పనిచేసేవారు. 1966లో రుక్మిణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
తెలుగు చిత్రసీమలో 4 దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన కోటా శ్రీనివాసరావు.. 1998లో గణేశ్ సినిమాలో విలన్ పాత్రకుగానూ తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. చిన్న, పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో సినిమాలకుగానూ నంది పురస్కారం దక్కింది. ఎన్నో రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందుకున్నారు.