హాలీవుడ్ సినిమాలు భారత్ లో ఆడాలంటే చాలా కత్తెరలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రొమాంటిక్ సీన్స్, అసభ్యకరమైన సంకేతాలను దాదాపుగా కట్ చేస్తారు. అయితే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంబంధించి చేసే కట్స్ ను హాలీవుడ్ సినీ అభిమానులు ఇష్టపడడం లేదు.
జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్‌మ్యాన్' చిత్రం నుండి 33 సెకన్ల సన్నివేశాన్ని కత్తిరించినందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) విమర్శలకు గురైంది. ఈ సన్నివేశంలో డేవిడ్ కోరెన్స్‌వెట్ పోషించిన సూపర్‌మ్యాన్ మరియు రాచెల్ బ్రోస్నాహన్ పోషించిన లోయిస్ లేన్ మధ్య రొమాంటిక్ క్షణాలు ఉంటాయి. జూలై 11, 2025న విడుదలైన ఈ చిత్రానికి CBFC బృందం U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో గణనీయమైన చర్చకు దారితీసింది, బోర్డు ప్రమాణాలలో తేడాలను చాలా మంది ప్రశ్నించారు.
CBFC నిర్ణయం బోర్డు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందంటూ ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో, వినియోగదారులు నిరసనను వ్యక్తం చేశారు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలలో అలాంటి సీన్స్ ఎన్నో ఉంటాయని, కానీ CBFC హాలీవుడ్ సినిమాల విషయంలో మరోలా ప్రవర్తిస్తూ ఉందంటూ విమర్శిస్తూ ఉన్నారు. అసభ్యకరమైన సాహిత్యంతో కూడిన ఐటెమ్ నంబర్‌లను ప్రేక్షకుల ముందుకు వదులుతున్న CBFC, హాలీవుడ్ సినిమాలోని ముద్దు సీన్స్ ను అడ్డుకోవడంలో లాజిక్ ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు.