కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి
కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోటా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని, 4 దశాబ్దాల పాటు సినీ రంగానికి ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని అన్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. 1999లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు.
కోటా శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్, తనికెళ్ల భరణి, శివాజీరాజా, అచ్చిరెడ్డి, రావు రమేష్, తదితరులు కోటా భౌతికకాయానికి నివాళులర్పించారు.
కోటా శ్రీనివాసరావు ఇక లేరనే వార్త తనను ఎంతో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'ప్రాణం ఖరీదు' సినిమాతో తామిద్దరం ఒకేసారి సినీ కెరీర్‌ను ప్రారంభించామన్నారు. విభిన్న పాత్రలతో ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రతి పాత్రను తను మాత్రమే చేయగలడన్నంత గొప్పగా నటించారని, ఇటీవల కుటుంబంలో జరిగిన విషాదం ఆయన్ను మానసికంగా కుంగదీసిందన్నారు. కోటా మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని పేర్కొన్నారు.
శ్రీనివాసర రావు భౌతికకాయానికి నివాళులర్పించిన నటుడు బ్రహ్మానందం.. ఆయన పార్థివ దేమాన్ని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చారు. బ్రహ్మానందాన్ని రాజేంద్ర ప్రసాద్ ఓదార్చారు.