సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియ‌ర్ న‌టి సరోజాదేవి క‌న్నుమూత‌

చిత్ర పరిశ్రమను ఏలిన అద్భుత నటి బి సరోజాదేవి ఇక లేరు. నటి సరోజాదేవి 7 దశాబ్దాల పాటు రంగుల ప్రపంచంలో చురుకుగా ఉన్నారు.

By Medi Samrat
Published on : 14 July 2025 10:42 AM IST

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియ‌ర్ న‌టి సరోజాదేవి క‌న్నుమూత‌

దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త నుంచి తేరుకోకముందే స్టంట్ మాస్టర్ రాజు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త విన్న కొద్ది గంట‌ల‌కే నటి బి సరోజాదేవి క‌న్నుమూశార‌న్న వార్త ద‌క్షిణాది సినీ ప్ర‌పంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

నటి సరోజాదేవి 7 దశాబ్దాల పాటు రంగుల ప్రపంచంలో చురుకుగా ఉన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత.. అలనాటి సూపర్ స్టార్లందరితో పాటు తెరపై మెరిసిన బి సరోజాదేవి ఈరోజు కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్యంతో బాధపడుతున్న బి సరోజాదేవి ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బెంగళూరులోని మల్లేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బి సరోజాదేవికి 87 సంవత్సరాలు.

అభినయ సరస్వతి, కన్నడతు పైంగిలి వంటి బిరుదులతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో 200 చిత్రాలలో న‌టించింది. 1955లో కన్నడ క్లాసిక్ మహాకవి కాళిదాసుతో 17 ఏళ్ల వయసులో సరోజా దేవి సినిమా ప్రయాణం మొదలైంది. 1958లో నాడోడి మన్నన్‌తో ఆమె ఖ్యాతి పొందింది.. ఆ సినిమాలో ఆమె M.G రామచంద్రన్ సరసన నటించింది. ఈ చిత్రం ఆమెకు తమిళ చిత్రసీమలో స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది.

ఆమెను భార‌త ప్ర‌భుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆమె తమిళనాడు నుండి కలైమామణి అవార్డును, బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఆమె 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీకి అధ్యక్షత వహించింది. కన్నడ చలనచిత్ర సంఘానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. సినిమా పట్ల ఆమెకున్న అంకితభావం ఈ పాత్రల ద్వారా ప్రస్ఫుటమైంది.

Next Story