గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగ భగల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో పాఠశాలల సమయాన్ని తగ్గించాలని నిర్ణయించింది. నేటి నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే నడవనున్నాయి. ఏప్రిల్ 6 దాకా ఈ పని వేళలు అమలలో ఉంటాయని విద్యాశాఖ ఆదేశాల్లో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒండిపూట బడులు కొనసాగుతున్నయి. ఉదయం 7.45 నుంచి 12 వరకు పాఠశాలలు నడుస్తుండగా.. ఎండ తీవ్రత దృష్ట్యా ఈ సమయంలో మార్పులు చేశారు.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి మే నెలలో పదో తరగతి పరీక్షలు ముగిసిన తరువాత వేసవి సెలవులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అయితే.. రోజురోజుకీ ఎండలు పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 24 నుంచే పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 7 నుంచి 16 వరకు 1నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.