కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి.. టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో రాకూడదంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 4:27 PM ISTకాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు రావాలని.. గాంధీల నాయకత్వం నుండి కాంగ్రెస్ పార్టీని విముక్తి చేయాలని కొందరు కోరుతూ ఉంటే.. మరికొందరేమో తిరిగి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించాలని కోరుతూ ఉన్నారు. కొద్ది నెలల కిందట కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయగా.. అనారోగ్య కారణాల వల్ల పార్టీ పగ్గాలను స్వీకరించడానికి సోనియాగాంధీ కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేక ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. ప్రియాంకగాంధీకి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీలో వినపడుతున్నాయి. ఇంకో నాలుగు నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించింది. ఆ తర్వాత మార్పులు మాత్రం పక్కాగా రానున్నాయి.
అచ్చం అలాంటి పరిస్థితే తెలుగుదేశం పార్టీలో ఏర్పడిందని 'ది వైర్' పత్రిక కథనాన్ని ప్రచురించింది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా నారా లోకేష్ ను తయారు చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించగా అది కాస్తా వర్కౌట్ కాలేదు. టీడీపీ యువరాజు నారా లోకేష్ అంటూ టీడీపీ 2019 ఎన్నికల్లో దిగగా.. అటు అసెంబ్లీ సీట్లను, పార్లమెంటు సీట్లను భారీగా కోల్పోయింది. భారీ ఓటమిని మూటగట్టుకున్న పార్టీ ప్రస్తుతం పార్టీ భవితవ్యం గురించి ఆలోచిస్తోంది. మంగళగిరి అసెంబ్లీకి పోటీ చేసిన నారా లోకేష్ కూడా ఓటమి పాలయ్యారు.
నారా లోకేష్ ఎన్నికల్లో గెలవకుండానే 2014-19 టీడీపీ ప్రభుత్వంలో పవర్ ఫుల్ నేతగా ఎదిగారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ గొప్పగా ప్రచారం చేయడం కూడా జరిగింది. పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేష్ విధులు నిర్వర్తించారు. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నిర్ణయాలు తీసుకునేది నారా లోకేష్ అంటూ చెప్పుకునే వారు.
2009 ఎన్నికల సమయం నుండే నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యతను పెంచుకుంటూ వెళ్లారు. పలు స్కీమ్ లకు నారా లోకేష్ రూపకల్పన చేశారని ప్రచారం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు నారా లోకేష్ దోహదపడతారని భావించినప్పటికీ అది వీలు పడలేదు. చంద్రబాబు నాయుడు ఊహాగానాలను తలక్రిందులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పును ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘానా విజయం సాధించింది.
రాహుల్ గాంధీ లాగే నారా లోకేష్ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. తన తండ్రితో పాటూ నారా లోకేష్ ప్రచారం చేయడం కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి యువతలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు కూడా యువత ఆసక్తిని ప్రదర్శించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు.
తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పటి నుండి మొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు చెప్పుకుని ప్రచారం చేయడం జరిగింది. ఆయన నీడ నుండి బయటకు రావడానికి చంద్రబాబు నాయుడు కూడా చాలా ప్రయత్నించారని పొలిటికల్ అనలిస్టులు తెలిపారు. కానీ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి స్వర్గీయ వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి నీడ నుండి ఎదుగుతూ వచ్చారు. నారా లోకేష్ కూడా తన తండ్రి లాగే తన స్థాయి ఏంటో చూపిస్తే తప్పకుండా రాజకీయంగా ఎదుగుతారని లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి రెండో సారి అధికారం వచ్చిన తర్వాత 2009లో వైఎస్ఆర్ మరణించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2017 లో పాదయాత్రను మొదలుపెట్టారు. 3648 కిలోమీటర్లు 341 రోజుల పాటూ నడిచారు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు.
పొలిటికల్ అనలిస్టులు కూడా నారా లోకేష్ జగన్ లాగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేయాలని సూచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తామని చెప్పి హైదరాబాద్ నుండి వచ్చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని మూడు రాజధానులను తీసుకొస్తున్నామని చెప్పారు.
అమరావతి మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పేశారు. ఇలాంటి ఊహించని స్టెప్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారని తాము కూడా అనుకోలేదని మరొక టీడీపీ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి లాగా నారా లోకేష్ కూడా బలమైన నేతగా ఎదగాలి అంటూ ఎవరూ ఊహించని విధంగా పనులు చేసుకుంటూ వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి టీడీపీకి ఆంధ్రప్రదేశ్ లో రాకూడదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.