మద్యం మత్తులో.. వంద అడుగుల బావిలో పడ్డాడు..
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 2:18 PM ISTఇద్దరు మిత్రులు వ్యాపార పని నిమిత్తం ఓ చోటుకు వెళ్లారు. అక్కడ పని కాలేదు. దీంతో ఇద్దరు కలిసి మందు కొట్టారు. ఇంతలో ఇద్దరిలో ఒకరికి దాహాం వేసింది. పక్కనే బావి ఉండడంలో నీటి కోసం అందులో తొంగి చూస్తూ.. అందులో పడ్డాడు. ఇది గమనించిన మరో మిత్రుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు గంటలు శ్రమించి దాదాపు వంద అడుగుల లోతు ఉన్న బావిలోంచి అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన కడప శివారులో చోటు చేసుకుంది.
కడప నగర శివారుల్లోని రామాంజినేయపురానికి చెందిన కిశోర్‌నాయక్, అయోధ్య రామయ్యలు బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ఇద్దరు బొప్పాయి పండ్ల కోసమని వాహనంలో చింతకొమ్మదిన్నెకు వచ్చారు. అక్కడ పండ్లు లేకపోవడంతో.. పక్కనే ఉన్న మద్యం దుకాణం వద్దకు వచ్చి మద్యం తీసుకుని సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఇద్దరూ బాగా తాగారు. దాహం వేయడంతో పక్కనే ఉన్న బావిలో నీళ్లు ఉంటాయన్న ఉద్దేశ్యంతో కిశోర్‌నాయక్ అందులోకి మెట్ల నుంచి దిగుతుండగా మత్తులో బావిలోకి పడిపోయారు. అయోధ్య రామయ్య ఇది గమనించి సీకే.దిన్నె పోలీసు స్టేషన్‌కు వచ్చి విషయం తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే ఎస్సై రాజరాజేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కడప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి బసివిరెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వంద అడుగుల లోపల ఉండడంతో అతన్ని బయటికి తీయడం కష్టసాధ్యంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది ధైర్యం చేసి బావిలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న కిశోర్ నాయక్ నడుముకు నైలాన్ తాడు కట్టి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో కిశోర్ నాయక్ తలకు, చేతికి గాయాలయ్యాయి. అతడిని 108లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.