ఈ ఏడాది ఇక 'డ్రీమ్ లెవెన్ ఐపీఎల్'.. ఒక్క ఏడాదికి ఎన్ని కోట్లు వెచ్చించారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 11:04 AM GMT
ఈ ఏడాది ఇక డ్రీమ్ లెవెన్ ఐపీఎల్.. ఒక్క ఏడాదికి ఎన్ని కోట్లు వెచ్చించారంటే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు రెండేళ్లుగా టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్న ‘వివో’ మొబైల్ సంస్థ ఈసారి అనివార్య పరిస్థితుల్లో ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చైనా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ‘వివో’ను తప్పించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో బీసీసీఐ, వివో ఉమ్మడి అంగీకారంతో ఈ ఏఢాదికి ఒప్పందం రద్దు చేసుకున్నాయి. కొత్త టైటిల్ స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన పనిలో పడ్డ బీసీసీఐకి పలు కంపెనీలు బిడ్డింగ్ లు దాఖలు చేశాయి. ఆగష్టు 14న బిడ్‌ల దాఖలు పూర్తయింది.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ ను డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. 222 కోట్ల రూపాయల బిడ్డింగ్ ను దాఖలు చేసిన డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్ షిప్ ను దక్కించుకుంది. చైనా దేశానికి చెందిన వీవో సంస్థ ఏడాదికి ఇచ్చే డబ్బుతో పోల్చుకుంటే డ్రీమ్ 11 కోట్ చేసిన అమౌంట్ సగమే..!

అన్‌ అకాడమీ(రూ.170 కోట్లు), బైజూస్‌ (రూ. 201కోట్ల)తో బిడ్ వేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ బిడ్డింగ్ రావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా సగానికి పైగా టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి ఆదాయాన్ని కోల్పోబోతున్నాయి. 2019 సీజన్ లో ఒక్కో ఫ్రాంచైజీకి టైటిల్ స్పాన్సర్ షిప్ ఆదాయం ద్వారా 55 కోట్లు లభించింది.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని భావించారు. కానీ ఆఖరు నిమిషంలో వివో తప్పుకుంది.

Next Story