ధోనీ, రైనా ఆ రోజే ఎందుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 1:20 PM GMT
ధోనీ, రైనా ఆ రోజే ఎందుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారంటే..?

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్న విషయం తనకు ముందే తెలుసని ధోనీ చిరకాల మిత్రుడు, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా వెల్లడించాడు. ఆగస్టు 14న రైనా, ధోనీ, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కర్న్ శర్మ చెన్నై వెళ్లారు. మరుసటి రోజు ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వెంటనే సురేశ్‌ రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

అయితే.. ఈ విష‌య‌మై రైనా మాట్లాడుతూ.. ఆగస్టు 15న రిటైర్మెంట్‌ ప్రకటించాలని తాము ముందే నిర్ణయించుకున్నట్లు రైనా తెలిపాడు. ధోని జెర్సీ నెంబర్‌ 7, తనది 3 రెండు పక్కపక్కన పెడితే 73 అవుతుందని, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొంది 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే మంచి రోజని భావించినట్లు తెలిపాడు.

ఇక‌.. రిటైర్మెంట్‌ ప్రకటించిన తరువాత తామిద్దరం మనస్పూర్తిగా కౌలిగించుకున్నామ‌ని రైనా అన్నాడు. తాను.. పియూష్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, కర్న్ శ‌ర్మ‌ అందరం కూర్చొని ముందురోజు త‌మ‌ కెరీర్‌ల‌ గురించి మాట్లాడుకున్నామని.. ఆరోజు రాత్రి ఆనందంగా గడిపామని రైనా చెప్పుకొచ్చాడు.

ఇదిలావుంటే.. ధోనీ 2004 సంవ‌త్స‌రం డిసెంబర్ 23న కెరీర్‌ ప్రారంభించగా.. రైనా 2005 సంవ‌త్స‌రం జూలై 30న ఆరంగ్రేటం చేశాడు. దాదాపుగా ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌ను ఒకేసారి ప్రారంభించారు. అలాగే వీరిద్దరు ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

Next Story