ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను.. 'నమస్తే ట్రంప్' చరిత్రలో నిలిచిపోతుంది
By అంజి Published on 25 Feb 2020 2:01 PM ISTఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ- ట్రంప్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పలు అంశాలపై కుదిరిన ఒప్పంద పత్రాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. అనంతరం మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత 8 నెలల్లో ట్రంప్, తాను ఎనిమిది సార్లు భేటీ అయ్యామని మోదీ తెలిపారు. మోతెరా స్టేడియంలో ట్రంప్‌కు అపూర్వ స్వాగతం పలికామన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం ఎప్పటికి నిలిచిపోతుందని, 21వ శతాబ్దంలో అమెరికా-భారత్ మైత్రీ కీలక ఘట్టమన్నారు. భారత్-అమెరికా మైత్రీ బంధానికి ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు. దేశ భద్రతకు అమెరికా, భారత్ మైత్రీ బంధం ఎంతో సాయంగా ఉంటుందని మోదీ అన్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ పాలసీలతో ట్రేడ్ బంధం బలోపేతం అవుతోందన్నారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయని, ట్రంప్ సతీసమేతంగా రావడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం పెరిగిందని మోదీ అన్నారు.
భారత్ పర్యటన తనకు ఎంతో ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరవలేనని అన్నారు. రక్షణ ఒప్పందాలపై చర్చించామని, 3 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ అన్నారు. అపాచీ, ఎం-16 హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందన్నారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, చొరబాట్లు ఎక్కువైపోయాయని ట్రంప్ అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యాక భారత్‌తో ఆర్థిక బంధం పెరిగిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు భారత్ పెరిగాయన్నారు. పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యహరించాల నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇంధన రంగంలో ఇరుదేశాలు ఒక అవగాహనతో ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. భారత్‌కు భారీ మొత్తంలో ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు చేసేందుకు అవగాహన కుదిరిందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు అమెరికా ప్రోత్సహం ఎప్పుడూ ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ఇవాంక హాజరయ్యారని ట్రంప్ గుర్తు చేశారు. ఇరుదేశాలకు మేలు చేసే మరికొన్ని కీలక ఒప్పందాలపై అవగాహనకు వచ్చామన్నారు.