సీఎం గారూ.. భార్యల టార్చర్ భరించలేకపోతున్నాం.. కాపాడండి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 April 2020 8:50 AM IST![సీఎం గారూ.. భార్యల టార్చర్ భరించలేకపోతున్నాం.. కాపాడండి..! సీఎం గారూ.. భార్యల టార్చర్ భరించలేకపోతున్నాం.. కాపాడండి..!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/Domestic-Violence.jpg)
కరోనా విజృంభణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో లాక్‌డౌన్ యథావిధిగా కోనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు నెలరోజులుగా ఇంటిపట్టునే ఉండటం వలన ఇంటిపోరు ఓ రేంజ్‌లో ఉంటుంది. మాములుగే చీటికి మాటికి గొడవలొచ్చే సంసారాలున్నాయి. ఒక్కపూటంటే ఏదో అనుకోవచ్చు.. కానీ నెల రోజుల నుండి ఇంటిపట్టునే ఉండటం వలన ఇంట్లో ఆడవాళ్ల పోరు భరించలేక తల బొప్పికడుతుంది అంటున్నారు తమిళనాడు కుటుంబరావులు. ఈ విషయమై మమ్మల్ని కాపాడాలి అంటూ సీఎంకు ఓ లేఖ కూడా రాశారు.
వివరాళ్లోకెళితే.. తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ లేఖ ప్రకారం.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లల్లో మగవారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇంట్లో భార్యల గృహహింస కారణంగా భౌతికంగా, మనసికంగా ఎంతో బాధపడుతున్నాం. మహిళా రక్షణ చట్టాలను భూచిగా చూపి బెదిరిస్తున్నారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ వేళలో గృహహింసకు పాల్పడే మగవారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీజీపీ రవి కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదికూడా మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. మగవారి బాధలను చెప్పుకునేందుకు ఓ హెల్ప్‌లైన్ అయినా ఏర్పాటు చేసి.. ఇళ్లకే పరిమితమైన భర్తలను.. భార్యల గృహహింస నుంచి కాపాడాలని సీఎం పళనిస్వామికి వినతిపత్రం పంపారు. ఈ విషయమై సీఎం దృష్టికి వెళ్తే ఎలా స్పందిస్తారో చూడాలి మరి.