మోదీ డిజిటల్ స్ట్రైక్ తో డ్రాగన్ రియాక్షన్ ఎలా ఉండనుంది?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Jun 2020 10:33 AM ISTరంగం ఏదైనా కానీ.. ఇప్పుడంతా ఆదాయం చుట్టూనే తిరుగుతోంది. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే.. దాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఇక అంతే సంగతులు. స్వదేశీ వస్తువుల్నే వాడాలని ప్రధాని మోదీ నేరుగా చెప్పటం ద్వారా చైనా వస్తువుల వినియోగాన్ని ఆపేయాలన్న సందేహాన్ని తన మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఆయన నోటి నుంచి మాట వచ్చిన ఇరవై నాలుగు గంటలలోనే చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. అన్ని ఆలోచించిన తర్వాతే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.
దాయాది పాక్ కు బుద్ది చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్ చేసిన మోదీ సర్కరు.. డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెప్పాలి. ఇప్పుడున్న ప్రపంచంలో ఏ దేశమైనా సరే.. తన ఆర్థిక మూలాల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. సరిగ్గా ఇదే అంశాన్ని తీసుకున్న మోదీ సర్కార్.. చైనా యాప్ ల మీద నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది.
ప్రభుత్వం నిషేధించిన 59 యాప్స్ లో టిక్ టాక్ .. షేర్ ఇట్.. వీ చాట్.. వీ మీట్.. యూసీ బ్రౌజర్.. క్యామ్ స్కానర్.. ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్.. డీయూ బ్యాటరీ సేవర్.. హెలో.. లైకీ లాంటి ప్రజాదరణ యాప్ లు ఉన్నాయి. టిక్ టాక్ కు దేశంలో పన్నెండు కోట్ల డౌన్ లోడ్స్ ఉన్నాయి. భారతీయుల వినియోగం కారణంగా ఆ సంస్థకు లభించే ఆదాయం భారీగా ఉంటుంది. ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కోవటం ద్వారా ఆ కంపెనీ తీవ్రంగా నష్టపోతుంది. పరోక్షంగా చైనా సర్కారు మీద ఒత్తిడి పెరుగుతుంది.
చైనాకున్న బలం దానికున్న అర్థిక మూలాలే. వాటికి భంగం వాటిల్లితే అది చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే మాయదారి రోగాన్ని ప్రపంచానికి అంటించిన చైనా.. ఇప్పుడో పెద్ద విలన్. ఆ దేశం కారణంగా తాము అనుభవిస్తున్న కష్టాల్ని ఏ దేశస్తులు ఊరుకోలేని పరిస్థితి. దీనికి తోడు.. కుయుక్తితో సరిహద్దుల దగ్గర ప్రదర్శిస్తున్న దూకుడుకు కళ్లాలు వేసేందుకు భారత్ కున్నవి రెండు మార్గాలు ఉండనున్నాయి.
అందులో ఒకటి సైనిక చర్య.. రెండోది దాని ఆర్థిక మూలాల మీద ఒత్తిడి పెరిగేలా చేయటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాతో యుద్ధం చేసే కన్నా.. డిజిటల్ స్ట్రైక్ చేయటమే ఉత్తమం. ఈ కారణంతోనే చైనా మీద ముప్పేట దాడి చేసేలా మోదీ సర్కారు యోచిస్తున్నట్లుగా చెప్పాలి. భారత్ తో పెట్టుకోవటం ద్వారా అన్ని విధాలుగా నష్టమన్న విషయాన్ని చైనా అర్థం చేసుకోగలిగితే.. తన దూకుడుకు కళ్లాలు వేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.