ఏ పోరాటమైనా రెండు పార్టీలు కలిసి చేస్తాయి: కన్నా లక్ష్మీనారాయణ

By సుభాష్  Published on  22 Jan 2020 2:44 PM GMT
ఏ పోరాటమైనా రెండు పార్టీలు కలిసి చేస్తాయి: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ జనసేన నేత పవన్‌కల్యాణ్‌, నాందేండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ లు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో వీరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై, రాజధాని అంశంపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినట్లు చెప్పారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఏ పోరాటమైనా రెండు పార్టీలు కలిసి చేస్తాయని పేర్కొన్నారు.

ఏపీ రాష్ట్రంలో చేపట్టబోయే భవిష్యత్‌ కార్యాచరణపై తాము చర్చించినట్లు చెప్పారు. అలాగే రేపు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఇతర కేంద్ర మంత్రలను కలవనున్నట్లు తెలిపారు. ఏపీ రాజధాని విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామని, ఇక ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్లు నాందేండ్ల మనోమర్‌ పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీలు చేపట్టబోయే ఉద్యమ కార్యచరణ గురించి జేపీ నడ్డాకు వివరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా..? అన్న మీడియా అడిగిన ప్రశ్నకు పవన్‌కల్యాణ్‌ సమాధానమిచ్చారు. జనసేన పార్టీని విలీనం చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తాము కేవలం బీజేపీ పార్టీతో పొత్తు మాత్రమే పెట్టుకున్నామని చెప్పారు.

Next Story