ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనాల పరుగులు

By సుభాష్  Published on  4 Jun 2020 5:42 AM GMT
ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనాల పరుగులు

ఢిల్లీలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి నోయిడాకు దక్షిణ తూర్పు భాగంలో 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 3.2గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ తెలిపింది. నోయిడాలో నాలుగు కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు గుర్తించారు. భూప్రకంపనలు సంభవించగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ప్రజలు రాత్రంత నిద్రలేకుండా గడిపారు.

కాగా, వారం రోజుల్లోనే ఢిల్లీతో పాటు హర్యానాలోని రోహతక్‌ కేంద్రాలుగా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. అయితే మే 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీ, నోయిడా, ఎన్వీఆర్‌ ప్రాంతాలతో పాటు హర్యానాలోనూ భూమి కంపించింది. భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు అధికారుల ప్రకటించారు. ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో, తాజాగా ఇప్పుడు కూడా స్వల్పంగా భూమి కంపించింది. కాగా, ఢిల్లీ కేంద్రంగా వరుసగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇలా ఢిల్లీలో వరుస భూప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. గత నెల రోజుల్లోనే ఆరు నుంచి ఏడు భూకంపాలు నమోదు కావడం ప్రజల్లో మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే.. భూప్రకంపనల వల్ల మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది.

Next Story