బాహుబలి యుద్ధనౌకను.. జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

Prime Minister Modi inaugurated India's first indigenous aircraft carrier INS Vikrant. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ భారత

By అంజి  Published on  2 Sep 2022 6:37 AM GMT
బాహుబలి యుద్ధనౌకను.. జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ భారత అమ్ముల పొదిలోకి చేరింది. కేరళ కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు షిప్‌యార్డ్‌లో ప్రధాని మోదీ గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకున్నారు. ఆ తర్వాత యుద్ధనౌకను జాతికి అంకితమిచ్చారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌకగా పేరుగాంచింది. భారతీయుల కృషి, పరిశ్రమ, ప్రతిభకు నిలువుటద్దమైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఐఎన్​ఎస్​-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానుంది.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని ప్రధాని మోదీ అన్నారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ నౌక ద్వారా భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల పక్కన చేరిందని కొనియాడారు. నౌక నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము స్వదేశంలోనే తయారైందని, ఎర్రకోట వేదికగా ఇచ్చిన పంచ ప్రాణాల నినాదం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో మిళితమై ఉందన్నారు. నౌకాదళ ఏర్పాటుతో ఛత్రపతి శివాజీ శత్రువులకు నిద్ర లేకుండా చేశారని, అందుకే ఐఎన్​ఎస్ విక్రాంత్​ను ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నానని చెప్పారు.

ఐఎన్​ఎస్​ విక్రాంత్ ఒక తేలియాడే ఎయిర్‌ఫీల్డ్. దానిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 5,000 ఇళ్లలో వెలుగులు నింపగలదు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. భార‌త‌ నావికాదళ కొత్త జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొత్త జెండాకు మోదీ అభివాదం చేశారు. భారతీయ సముద్ర వారసత్వానికి కొత్త జెండా తగినట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత నౌకాదళ జెండా మార్చడం ఇదే మొదటి సారి కాదు. 1950 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మార్చారు. దీనితో నాలుగో సారి.

ఐఎన్​ఎస్​ విక్రాంత్​ ప్రత్యేకతలివే

ఈ బాహుబలి నౌక గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నౌక ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. విక్రాంత్‌లో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు .గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రి, రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి. నౌకలో ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.

విక్రాంత్‌ యుద్ధనౌక లోపల దాదాపు 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. వాతావరణ పరిస్థితులకు నౌకలోని సిబ్బంది ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఎయిర్‌కండీషనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక​ తయారీ కోసం లోపల 2వేల మంది పని చేయగా, మరో 13వేల మంది బయట శ్రమించారు.హైదరాబాద్‌ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి. విక్రాంత్‌ తయారీకి మొత్తం 20వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

Next Story