మరోసారి వార్తల్లో నిలిచిన రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 2:14 PM IST
మరోసారి వార్తల్లో నిలిచిన రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా పెళ్లి ఇటీవలే మిహీక బజాజ్ తో పూర్తయింది. ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ ఫోటో కూడా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఇలాంటి సమయంలో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ వార్తల్లో నిలిచారు.

అభిరామ్ కారుకు ప్రమాదం జరిగిందన్న వార్త బాగా వైరల్ అవుతోంది. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని మణికొండకు రాగా.. కారు యజమానిని కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని సతీశ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అలా వెళ్లిన కొద్దిసేపటికే.. పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయనీ.. రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు, అభిరామ్‌లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. ఎవరూ మద్యం మత్తులో లేరని తేలిందని.. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

వివాదాలంటూ లేని దగ్గుబాటి కుటుంబంలో అభిరామ్ పేరు కొద్దిరోజుల కిందట నటి శ్రీరెడ్డి బయటకు తీసింది. దగ్గుబాటి కుటుంబం నుండి మరో హీరోను ఇంట్రడ్యూస్ చేయాలని సురేష్ బాబు అనుకుంటూ ఉన్న తరుణంలో శ్రీరెడ్డి అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్టు చేసి సంచలనానికి నాంది పలికింది. పలుమార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లలో అభిరామ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Next Story