కరోనా ఎఫెక్ట్ : మైనస్‌లోకి చమురు ధరలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 April 2020 8:21 AM IST![కరోనా ఎఫెక్ట్ : మైనస్‌లోకి చమురు ధరలు కరోనా ఎఫెక్ట్ : మైనస్‌లోకి చమురు ధరలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/Crude-Oil-Price.jpg)
కరోనా వైరస్ విలయతాండవానికి ప్రపంచ దేశాలు కుదేలవుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితి పతనావస్థకు చేరుకుంది. దాని ప్రభావం కాస్తా చమురు రంగంపై పడింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. క్రూడాయిల్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళంలోకి పోయింది. సోయవారం అర్థరాత్రి 12.10కి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 244 శాతానికి పైగా పడిపోయింది. దీంతో.. చమురు ధర (-26.24) మైనస్ డాలర్లకు పడిపోయింది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ఆ ప్రభావం ప్రపంచ చమురు రంగంపై బాగానే పడింది. మే నెలకు సంబంధించి నైమెక్స్ రకం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ రేటు 244 శాతానికి పైగా తగ్గిపోయింది. జూన్ నెల ఫ్యూచర్స్‌కు సంబంధించి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర కూడా 5.7 శాతం తగ్గిపోయి 26.48 డాలర్లకు చేరింది. గతంలో నైమెక్స్-బ్రెంట్ చమురు రేట్ల మధ్య ఇంత భారీ తేడా చోటుచేసుకోలేదు.
ఓ దశలో పెట్రోలియం ఎగుమతి దేశాలు మే 1 నుంచి రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ముందుకొచ్చాయి. అయినా ధరల పతనం ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి రవాణా అక్కడే ఆగడం.. ఆయా దేశాలలో చమురు నిల్వలు మిగిలిపోవడంతో చమురు రంగం ఆర్థికంగా కుదేలైంది. మే నెలలో చాలా దేశాలు పెద్దగా చమురు కొనేందుకు ముందుకు రాకపోవడంతో ధర ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది.