చిన్ననాటి నుంచి 'ప్రేమిస్తే'.. అచ్చం సినిమాల్లోలా తుపాకీతో ఇంటికి వెళ్లి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరటట్‌లోని మవానా నగర్‌కు చెందిన ఓ యువకుడు ఇద్దరు సహచరులతో కలిసి మున్నాలాల్ మొహల్లా వద్దకు చేరుకుని బాలికను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరటట్‌లోని మవానా నగర్‌కు చెందిన ఓ యువకుడు ఇద్దరు సహచరులతో కలిసి మున్నాలాల్ మొహల్లా వద్దకు చేరుకుని బాలికను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. నేను తనను చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నాను, నేను ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని పేర్కొంటూ.. బాలిక తల్లి, చెల్లెలు నిరసన వ్యక్తం చేయడంతో యువకుడు తుపాకీ గురిపెట్టి కాల్చివేస్తానని బెదిరించాడు. మొత్తం కుటుంబాన్ని 20 నిమిషాల పాటు బందీలను చేసుకున్నాడు. భయపెట్టేందుకు కాల్పులు కూడా జరిపారు. అరుపులు, కాల్పుల శబ్ధం విన్న ప్రజలు ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు కాల్పులు జరుపుతూ పారిపోయాడు. నిందితుడు బాలిక మేనమామకు బావ. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై సమాచారం తీసుకున్నారు.
హస్తినాపురం గణేష్‌పూర్ గ్రామానికి చెందిన నయీముద్దీన్ ఫర్నిచర్ పని చేస్తుంటాడు. ప్రస్తుతం అతను మొహల్లా మున్నాలాల్‌లో నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నయీముద్దీన్ భార్య గుల్జార్, కుమార్తెలు సోనియా, సనోవర్ ఇంట్లో ఉన్నారు. ఇంతలో నయీమ్ తమ్ముడు అన్వర్ బావమరిది, స్యాల్ మార్క్‌పూర్ భవన్‌పూర్ నివాసి అల్తాఫ్ కుమారుడు షోయబ్ ఇద్దరు సహచరులతో కలిసి కారులో అక్కడికి చేరుకున్నాడు.
షోయబ్ తన వెంట రావాలని సోనియాను కోరాడు. ఆమె నిరాకరించింది. దీంతో నిందితుడు ఆగ్రహంతో తుపాకీ గురిపెట్టాడు. ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. తల్లి, చెల్లెలు నిరసన తెలపడంతో ఆ బాలికపై తుపాకీ గురిపెట్టాడు. దాదాపు 20 నిమిషాల పాటు సినిమా తరహాలో తల్లీ, ఇద్దరు కూతుళ్లను బందీలుగా ఉంచాడు. సోనియాను వెంట తీసుకెళ్లాలని అతడు పట్టుదలతో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. సోనియా ఒప్పుకోకపోవడంతో తుపాకీతో కాల్చడం మొదలుపెట్టాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు కూడా వచ్చారు. నిందితులను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. షోయబ్, అతని స్నేహితులు అందరినీ బెదిరించారు. జనం పెరగడంతో కాల్పులు జరిపి సహచరులతో కలిసి పారిపోయాడు.
ఇంతలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మొత్తం విషయంపై సమాచారం తీసుకున్నారు. నిందితుడు తన ఫర్నిచర్ షాపులో పనిచేసేవాడని గుల్జార్ తెలిపారు. ఇంటికి కూడా వచ్చేవాడని పేర్కొంది. నిందితుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అఖిలేష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.