మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అన్నయ్యను తమ్ముడే హత్య చేశాడు. అన్న తన ప్రియురాలిని కలవకుండా తమ్ముడిని అడ్డుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిని హత్యానేరం కింద అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుణ ఎస్పీ రాజీవ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. సిటీ కొత్వాలి ప్రాంతంలోని మత్కారీ కాలనీలో పట్టపగలు ఈ హత్య చోటు చేసుకుంది. ఎఫ్‌ఎస్‌ఎల్, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించగా మృతుడి తమ్ముడు సచ్‌దేవా అనే యువకుడి పేరు బయటకు వచ్చింది.
నిందితుడు సచ్‌దేవా, అతని అన్న రాజుకు వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సచ్ దేవాకు ఓ యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రపోజ్ డే రోజున నిందితుడు తన స్నేహితురాలిని చూడడానికి వెళుతుండగా.. అన్నయ్య రాజు అడ్డుకోవడంతో ఆ యువకుడు సహనం కోల్పోయి గాజు సీసాతో అన్నయ్య గొంతు కోశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉంచిన డబ్బుతో నిందితుడు గ్వాలియర్‌కు పారిపోయాడు. పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.