పెళ్లి చేసుకోబోతున్న అన్నను చంపాలని తమ్ముడే అనుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీహార్‌లోని బెట్టియాలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతూ ఉండగా.. పెళ్లి కొడుకు తమ్ముడు చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఊరేగింపు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా పెళ్లికొడుకు తమ్ముడు దాడి చేసి.. అన్నయ్యను ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. వైద్యులు వరుడి ప్రాణం కాపాడారు. చికిత్స తర్వాత, తమ్ముడు పోలీసుల లాకప్‌కు చేరుకోగా.. పెళ్లి ఊరేగింపు యథావిధిగా మళ్లీ ముందుకు సాగింది.
నవల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాద్వా భవ్నీపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఆ సమయంలో రోషన్ పాఠక్ తన అన్న దీపక్ పాఠక్ పై కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు వరుడిని చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం యోగాపట్టిలో చేర్పించారు. దాడి చేసిన సోదరుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స అనంతరం దీపక్ పాఠక్ పెళ్లి చేసుకోడానికి కళ్యాణ మండపానికి వెళ్ళాడు. ఈ ఘటనకు సంబంధించి నవల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ యోగేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ, దీపక్ పాఠక్ పై దాడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడు రోషన్ పాఠక్ అలియాస్ ఛోటా డాన్‌ను జైలుకు పంపినట్లు తెలిపారు. అన్నయ్యపై దాడి చేసిన నిందితుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడని తెలుస్తోంది. దాడి చేయడానికి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.