డబ్బులు ఇవ్వకపోతే నీ ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను నీ భర్తకు పంపిస్తాను అంటూ వివాహితను బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ అభ్యంతరకర వీడియోలను పెట్టుకుని ఆమె నుంచి డబ్బు వసూలు చేసిన కేసులో ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పీఎస్ సిబ్బంది ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాధితురాలిని సోషల్ మీడియా వేదికగా కలుసుకుని స్నేహితుడిగా మారాడు. మొదట వీడియో కాల్‌లో మహిళను బట్టలు విప్పమని ప్రలోభపెట్టి, ఆపై మొత్తం వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. సెంట్రల్ ఢిల్లీ డీసీపీ శ్వేతా చౌహాన్ మాట్లాడుతూ.. నిందితులు బాధితురాలి నుంచి రూ.1.25 లక్షలు దోపిడీ చేశాడని, తర్వాత మరో రూ.70 వేలు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే వైరల్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది.
"ఆ బ్లాక్‌మెయిల్‌తో విసిగిపోయిన ఆ మహిళ అతనికి డబ్బులు ఇవ్వడం మానేసింది. అనంతరం అభ్యంతరకర వీడియోను నిందితుడు ఆమె భర్తకు పంపాడు. "నిందితుడు ఇప్పటివరకు బాధితురాలి నుండి రూ. 1.25 లక్షలు దోపిడీ చేసాడు. తరువాత ఆమె క్లిప్‌ను పబ్లిక్‌గా పెడతానని బెదిరించి రూ. 70,000 డిమాండ్ చేశాడు. బాధితురాలు డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో, నిందితుడు ఆమె భర్తకు వీడియోను పంపించాడు," అని డీసీపీ శ్వేతా చౌహాన్ చెప్పారు. విషయం పోలీసుల దాకా రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.