కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది. గొల్లప్రోలు మండలంలోని గ్రామానికి చెందిన బాలిక, అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బాలిక అతనికి దూరమైంది. ఒక్కసారి మాట్లాడాలని మంగళవారం అర్థరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు బాలికను తీసుకెళ్లిన అశోక్ ఆమెను మాటల్లో పెట్టి బ్లేడుతో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. అనంతరం వేట్లపాలెం సమీపంలో అశోక్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.