కామాంధుల వలన మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయింది. బహిర్భూమికి వెళ్లిన యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఒంటరిగా వున్న యువతిని ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన ఓ ఇంట్లో మరుగుదొడ్డి లేదు. ఆ ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసముండే యువతి ప్రతిరోజూ గ్రామశివారులో బహిర్భూమికి వెళ్లేది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు పక్కా ప్లాన్ చేసుకుని మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు.
యువతి ఒంటరిగా బహిర్భూమికి వెళ్ళగా ఆమెను బైక్ పై ఫాలో అయ్యారు యువకులు. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఇంటికి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఆశ్రయించారు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి.