మహారాష్ట్రలోని థానే జిల్లాలో డొంబివిలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. చేప అమ్మకం కోసం జరిగిన వాదనలో బంధువును హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హితేష్ సంజయ్ నఖ్వాల్ శనివారం నాడు తన బంధువైన భానుదాస్ అలియాస్ ముకుంద్ దత్త చౌదరి (55)తో గొడవపడ్డాడు. గొడవ తర్వాత హితేష్ తన బంధువును డోంబివిలీ పట్టణంలోని ఖంబల్‌పాడలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో అతని మెడపై దాడి చేశాడని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజయ్ అఫ్లే తెలిపారు.
సమాచారం అందుకున్న పోలసులు సంఘటనా స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భానుదాస్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని ఆదివారం రోజు కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.