సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను బస్సు ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రద్దీగా ఉండే మార్కెట్ ఏరియా కరోల్ బాగ్ పక్కనే ఉన్న ఝండేవాలన్‌లోని కాల్ సెంటర్‌లో ఆ మహిళ పనిచేస్తోంది. ఆ మహిళను సప్నా యాదవ్‌గా గుర్తించారు. ఫుటేజీలో బస్సుకు ఎడమవైపు నుంచి మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డు దాటే ప్రయత్నంలో ఆమె బస్సు ముందు వెళుతోంది. అయితే బస్సు అకస్మాత్తుగా కదిలి ఆమెపైకి దూసుకెళ్లింది. రోడ్డుపై ఉన్న ప్రజలు డ్రైవర్‌ను ఆపమని కేకలు వేశారు. తూర్పు ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లో నివాసం ఉంటున్న యాదవ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బస్సు డ్రైవర్, అతని సహాయకుడు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు.