వెడ్డింగ్ కార్డులు పంచడానికి వెళ్లిన యువతిని అమ్మేశారు

Woman on her way to distribute her wedding card gang-raped. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో 18 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By Medi Samrat  Published on  10 May 2022 6:45 PM IST
వెడ్డింగ్ కార్డులు పంచడానికి వెళ్లిన యువతిని అమ్మేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో 18 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన పెళ్లి కార్డులు పంచేందుకు వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు తనను అడ్డగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. నిందితులు తనను ఓ పార్టీ నాయకుడి వద్దకు తీసుకెళ్లారని కూడా బాలిక ఆరోపించింది. ఆమెకు ఏప్రిల్ 21న వివాహం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 18న గ్రామంలో పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లిన సమయంలో తనను అడ్డుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కొన్ని రోజుల పాటూ వేర్వేరు ప్రదేశాల్లో ఉంచారని, తరువాత తనను ఝాన్సీలో నాయకుడికి అప్పగించారని బాధితురాలు ఆరోపించింది.

వేరొకరితో కలిసి జీవించేందుకు ఆమెను బలవంతంగా మధ్యప్రదేశ్‌లోని దతియా గ్రామానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఎలాగో దతియా నుండి తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించింది. పోలీసుల సహాయంతో ఆమెను పత్రి గ్రామం నుంచి రక్షించారు. బాధితురాలి కిడ్నాప్, అత్యాచారం, అమ్మకం ఫిర్యాదుపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తహరౌలీ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అనూజ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై సీరియస్‌గా విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.









Next Story