భర్తను చంపిన భార్య.. డెడ్ బాడీని ఏమి చేసిందంటే..!

Woman kills husband, dumps sack with his body in park. వాయువ్య ఢిల్లీలోని పితంపురాలో శనివారం నాడు 30 ఏళ్ల మహిళ 32 ఏళ్ల భర్తకు మత్తుమందు

By Medi Samrat  Published on  12 April 2022 1:04 PM GMT
భర్తను చంపిన భార్య.. డెడ్ బాడీని ఏమి చేసిందంటే..!

వాయువ్య ఢిల్లీలోని పితంపురాలో శనివారం నాడు 30 ఏళ్ల మహిళ 32 ఏళ్ల భర్తకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు. మహిళ తన మైనర్ కుమారుడి సహాయంతో మృతదేహాన్ని గోనె సంచీలో నింపి, అతని సైకిల్‌పై పార్కుకు తీసుకెళ్లి అక్కడ పడవేసింది. తన భర్త నిరుద్యోగి అని.. తాగుబోతు కావడంతో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మహిళ పోలీసులకు తెలిపింది. తన భర్త భరత్ లాల్ తనపై, ఇద్దరు మైనర్ పిల్లలను హింసించడంతో విసిగిపోయి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది భార్య లక్ష్మీ దేవి.

ఏప్రిల్ 11న, పితాంపురలోని మహిళా పార్క్ ప్రవేశ ద్వారం దగ్గర బ్యాగ్‌లో ఒక వ్యక్తి మృతదేహాన్ని నింపినట్లు పోలీసులకు సమాచారం అందింది. గోనె సంచిని కట్టేందుకు ఇనుప తీగను ఉపయోగించగా, బాధితుడి మెడపై లిగేచర్ గుర్తులు, ముక్కుపై రక్తం పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పిఎస్ మౌర్య ఎన్‌క్లేవ్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 301 మరియు 201 కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయబడింది. దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు భరత్‌లాల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పీతాంపురాలో నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తన భర్త ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కి వెళ్లినప్పుడు కనిపించకుండా పోయాడని విచారణలో లక్ష్మి పోలీసులకు తెలిపింది. వెతికినా ఎక్కడా కనిపించలేదని చెప్పింది.

కానీ లక్ష్మి తన స్టేట్‌మెంట్‌లను మారుస్తూనే ఉంది. ఆమె మాటల్లో కొన్ని వైరుధ్యాలు ఉండడంతో దర్యాప్తు బృందానికి అనుమానం కలిగించింది. సుదీర్ఘంగా విచారించగా, ఆమె తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని తన స్వగ్రామమైన సిల్లార్‌పురా గ్రామంలో పదిహేనేళ్ల క్రితం భరత్‌తో తనకు వివాహమైందని లక్ష్మి పోలీసులకు తెలిపింది. భరత్‌కు ఉద్యోగం లేదని, మద్యానికి బానిసై ఆమెను తీవ్రంగా కొట్టేవాడని చెప్పుకొచ్చింది. చిత్రహింసలు, వేధింపులు, గృహ హింసతో విసిగిపోయిన ఆమె అతన్ని చంపాలని నిర్ణయించుకుంది.

కొన్ని నెలల క్రితం ఆమె స్వగ్రామం నుండి నిద్ర మాత్రలు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 9, రాత్రి 11 గంటల సమయంలో, భర్త మద్యం సీసాలో పదిహేను మాత్రలు కలిపింది. మద్యం సేవించి మగతగా మారడంతో, ఆమె అతనిని గొంతుకోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం, తన కుమారుడి సహాయంతో సైకిల్‌పై శవాన్ని తీసుకెళ్లి పార్క్‌లో పడేసింది. ఆమె నిద్రమాత్రలు కలిపిన మద్యం సీసా, గొంతు నులిమి చంపేందుకు ఉపయోగించిన ఆయుధం, నేరం చేసినప్పుడు ఆమె ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Next Story
Share it