దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. నైరుతి ఢిల్లీలో గురువారం నాడు ఓ మహిళను ఆమె పిల్లల ముందే కత్తితో పొడిచి చంపారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోయారు. పోలీసు అధికారి వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, "మధ్యాహ్నం 2:00 గంటలకు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ కత్తిపోట్లకు గురైనట్లు మాకు పిసిఆర్ కాల్ వచ్చింది. మేము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాము. మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు" అని తెలిపారు.
"ఆమె తన పిల్లలతో ఇంటికి వెళుతున్నప్పుడు నిందితుడు ఆమెను వెంబడిస్తున్నట్లు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ లభించింది" అని పోలీసులు తెలిపారు. ఆ ఫుటేజీ ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో నిందితుడు ఆమెను కత్తితో పొడిచి తప్పించుకోగలిగాడు. విచారణలో మహిళ, నిందితులు గతంలో పొరుగువారు అని తేలింది. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. "హత్య కేసు నమోదు చేశాము. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు'' అని పోలీసు అధికారి తెలిపారు.