నెత్తుటి మడుగులో భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ మృతదేహాలు.. కనిపించకుండా పోయిన భర్త..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 6:24 PM IST

నెత్తుటి మడుగులో భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ మృతదేహాలు.. కనిపించకుండా పోయిన భర్త..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని చందన్ పార్క్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఓ ఇంట్లో నుంచి పిల్లల అరుపులు వినిపించడంతో పక్కింటి వారు గమనించారు. తలుపు సందుల్లోంచి రక్తం బయటకు వస్తుండటంతో భయాందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, నెత్తుటి మడుగులో పడి ఉన్న నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘోర దృశ్యం చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మృతులను అనిత, ఆమె ముగ్గురు కుమార్తెలుగా గుర్తించారు. చనిపోయిన పిల్లల వయసు కేవలం 7, 5, 3 ఏళ్లు మాత్రమే. పదునైన ఆయుధంతో ఈ నలుగురి గొంతులు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణం జరిగిన రాత్రి నుంచి అనిత భర్త కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ దారుణ హత్యలకు అతడే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story