మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్‌లో 40 అడుగుల ఎత్తున్న నర్మదా వంతెనపై నుంచి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సదరు వ్యక్తి సూసైడ్ నోట్‌ను వదిలిపెట్టి వెళ్ళాడు. భరణం డబ్బులకు చేస్తున్న డిమాండ్లే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. భార్యతో విడాకుల విషయంలో వాదనలు జరుగుతున్నట్లు తెలిపాడు. కోటి రూపాయలు కావాలని అత్తమామల కుటుంబం, తన భార్య కోరారని ఆరోపించాడు. తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెబుతూ తన మరణానికి కొద్దిసేపటి ముందు తీసిన వీడియోలో చనిపోయిన వ్యక్తి తెలిపాడు.
డిప్యూటీ రేంజర్ కుమారుడు అజయ్ ద్వివేది జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్వాలోని నర్మదా వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం అజయ్ ద్వివేది నర్మదా వంతెనపై నుండి దూకాడు. మూడు రోజుల తర్వాత అతడి మృతదేహం లభించింది. సమాచారం అందిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ప్రమోద్ ద్వివేది తన కుమారుడి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బర్వా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజయ్ తండ్రి ప్రమోద్ ద్వివేది రేవా జిల్లా సిర్మౌర్‌లో డిప్యూటీ రేంజర్. అజయ్ అత్తమామలు మాపై వరకట్న వేధింపుల ఫిర్యాదును దాఖలు చేశారని, ఎంతగానో తన కుమారుడిని హింసించారని ప్రమోద్ ద్వివేది ఏడుస్తూ చెప్పుకొచ్చారు.