ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ భర్త తన ఆహారంలో పీరియడ్స్ బ్లడ్ కలుపుతోందని భార్యపై ఆరోపణలు చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నివేదిక ప్రకారం ఆ వ్యక్తి ఇటీవల ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇన్‌ఫెక్షన్ సోకి అతడి శరీరంలో వాపు వచ్చిందని పరీక్షలో తేలింది. ఆ తర్వాత తన భార్య తన ఆహారంలో పీరియడ్ బ్లడ్ కలిపిందని ఆరోపిస్తున్నాడు. కేసు పాతదైనా ఇప్పుడు భర్త ఆరోపణలపై విచారణకు నలుగురు సభ్యుల వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు నివేదికను ఘజియాబాద్ పోలీసులకు సమర్పించనున్నారు.
ఈ ఘటనపై భర్త గతేడాది జూన్‌లో కేవీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులు జిల్లా వైద్యాధికారికి లేఖ రాశారు. భర్త ఫిర్యాదు మేరకు కేవీ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతని భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులపై IPC సెక్షన్ 328 మరియు 120B, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదైంది. వీరిద్దరికీ 2015లో పెళ్లి అయ్యిందని, ఓ కొడుకు కూడా ఉన్నారని, అయితే పెళ్లయినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. భార్య తన అత్తమామలను దూరంగా ఉండమని అడిగేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై భార్య చేతబడి కూడా చేసిందని భర్త ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.