మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.. స‌డెన్‌గా భార్య ఆత్మ‌హ‌త్య‌తో భ‌ర్త కూడా..

Wife And husband committed for suicide. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on  17 Feb 2022 6:38 PM IST
మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.. స‌డెన్‌గా భార్య ఆత్మ‌హ‌త్య‌తో భ‌ర్త కూడా..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. కాంకేర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సత్య మేష్రం (25 ఏళ్లు) సీమా మేష్రం (23 ఏళ్లు)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మంకేసరి గ్రామంలో అద్దె గదిలో ఉండేవారు. అతను మంగళవారం పని కోసం బయటకు వెళ్ళాడు. ఇంట్లో సీమ ఒంటరిగా ఉంది. అయితే పక్కింటి వాళ్లు వచ్చి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు.

భర్తకు విషయం తెలియగానే ఇంటికి పరుగెత్తాడు. మృతదేహాన్ని కిందకు దించాడు. ఆ తర్వాత సీమను ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య మరణించిన తర్వాత సత్యా మార్చురీలోని మృతదేహం దగ్గర మౌనంగా కూర్చున్నాడు. తర్వాత రాత్రి ఎక్కడికో లేచి వెళ్లిపోయాడు. అతడు కనిపించకపోవడంతో అతని కోసం వెతికారు, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. మరుసటి రోజు గ్రామస్తులు సత్య మృతదేహాన్ని ఇంటి వెనుక చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని చూశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసు ఇంటరాగేషన్‌లో, ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని గుర్తించారు. పెళ్లయి మూడేళ్లు అయింది. పిల్లలు లేరు. భార్య ఉరివేసుకున్న 10 గంటల తర్వాత భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మరణాలకు గల కారణాలేమిటని తెలుసుకునే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story