త్రిపురలో మోరల్ పోలీసింగ్‌కు సంబంధించిన షాకింగ్ ఘటన బయటపడింది. అక్రమ సంబంధం కలిగి ఉన్నారని భావించిన గ్రామస్థులు ఒక వ్యక్తి మరియు ఒక మహిళను చితక్కొట్టారు. చెట్టుకు కట్టేసి మరీ వారిని కొట్టారు. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని గోలఘటి ప్రాంతంలోని పాల్‌పరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంట అక్రమ సంబంధం పెట్టుకుందని స్థానికులు ఆరోపిస్తూ వారే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని యువతిని, ఆ వ్యక్తిని కొట్టారు.
వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సదరు వ్యక్తి తాను మహిళకు దూరపు బంధువని పదే పదే చెప్తూ ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దంపతులను విడిపించారు. "మేము పరిస్థితి గురించి తెలుసుకున్నాము. ఒక నివేదిక తయారు చేసి.. దర్యాప్తు చేస్తున్నాము" అని ఐజిపి (లా అండ్ ఆర్డర్) అరిందమ్ నాథ్ తెలిపారు. త్రిపుర మహిళా కమిషన్ చైర్‌వుమన్ బర్నాలీ గోస్వామి ఈ ఘటనను 'అమానవీయం'గా అభివర్ణించారు. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలి అని మహిళా కమిషన్ తెలిపింది. "ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మేము బృందాన్ని పంపుతాము" అని ఆమె పేర్కొన్నారు.