లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడింది.
By Medi Samrat Published on 20 Aug 2023 6:39 PM ISTఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడింది. బస్సులో 33 మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో 20 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం బృందాలు గాలిస్తున్నాయి. 33 మంది ప్రయాణికులతో త్రిమూర్తి ట్రావెల్స్ బస్సు.. గంగోత్రి ధామ్ నుండి తిరుగు ప్రయాణంలో వస్తోంది. గంగ్నాని సమీపంలో క్రాస్ బారియర్‌ను ఢీకొట్టి బస్సు లోయలో పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం.. యుకె 07 8585 నెంబర్ గల బస్సు గంగోత్రి నుండి ఉత్తరకాశీ వైపు 33 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఇప్పటివరకు 19 మంది క్షతగాత్రులను రక్షించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అర్పన్ యదువంశీ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరారు. జిల్లా ఆసుపత్రి నుంచి మరో రెండు అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి తరలించారు.