ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి చనిపోవడంతో కృంగిపోయింది. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు దాని మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆమె ఆశలు సన్నగిల్లడంతో మూడోరోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. 32 సంవత్సరాల పూజా అమ్రోహాలోని హసన్‌పూర్‌లో నివాసి. ఎనిమిదేళ్ల క్రితం పూజకు ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహమైంది. రెండేళ్ల తర్వాత విడాకులతో ముగిసింది. అప్పటి నుండి ఆమె తన తల్లి గజ్రా దేవితో తన తల్లిదండ్రుల ఇంటిలో నివసిస్తోంది.
ఒంటరితనాన్ని తట్టుకోవడానికి, పూజ పిల్లిని పెంచుకుంటూ ఉంది. అది గురువారం మరణించింది. జంతువును పాతిపెట్టమని ఆమె తల్లి సూచించినప్పుడు పూజ నిరాకరించింది. ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పిల్లిని పాతిపెట్టమని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ ఆమె మొండిగా ఉంది.
శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంట్లోని మూడో అంతస్తులోని తన గదికి తాళం వేసుకుంది. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో గజ్రా దేవి తన కూతురిని చూసేందుకు వెళ్లింది. పూజా మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చనిపోయిన పిల్లి సమీపంలో పడి ఉంది. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.