అత్యాచారయత్నానికి గురయ్యాక.. తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల బాధితురాలికి సహాయం చేయకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తులకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. అలాంటి వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో పోలీసులు 15-20 మంది గుర్తుతెలియని వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆమె గుర్తింపు, ఇతర నేరాలను బహిర్గతం చేసినందుకు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.
అక్టోబరు 23న కన్నౌజ్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్ సమీపంలో పొదల్లో మైనర్ బాలిక పడి ఉందని తనకు సమాచారం వచ్చిందని, సహాయం కోరుతూ కేకలు వేస్తున్నప్పటికీ చాలా మంది బాలికను రికార్డ్ చేస్తున్నారని పోలీసు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, పోలీసు అధికారి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. కొందరు వ్యక్తులు ఇంటర్నెట్‌లో వీడియోలను అప్‌లోడ్ చేసి, అమ్మాయి గుర్తింపును బహిర్గతం చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 228 A (కొన్ని నేరాలకు పాల్పడిన వ్యక్తి యొక్క గుర్తింపును బహిర్గతం చేయడం), 354C (వోయూరిజం) మరియు 505(2) (వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తనను సృష్టించే లేదా ప్రోత్సహించే ప్రకటనలు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు.