21 ఏళ్ల మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం విద్యార్థి మృతికి సంబంధించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శైలేంద్ర శంఖ్వార్ అనే విద్యార్థి అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలోని తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవిరంజన్ తెలిపారు.
విద్యార్థి తండ్రి ఉదయ్‌సింగ్ శంఖ్‌వార్ ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీతా అనేజా, పరీక్షల నియంత్రణాధికారి గౌరవ్‌సింగ్ సహా ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు, శైలేంద్రను పరీక్షలో కూర్చోనివ్వబోమని గౌరవ్‌సింగ్ బెదిరించాడని.. అతడిని కులపరంగా కూడా దూషించారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి అంత్యక్రియలు ఆదివారం గట్టి బందోబస్తు మధ్య నిర్వహించామని, పోస్టుమార్టం కూడా పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శైలేంద్ర శంఖ్‌వార్‌కు శనివారం పరీక్ష ఉంది. అతను పరీక్ష హాల్‌కు చేరుకోకపోవడంతో కళాశాల సిబ్బంది అతని హాస్టల్ గదికి వెళ్లి తనిఖీ చేయగా లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా శైలేంద్ర మృతి చెందినట్లు గుర్తించారు. విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రి ముందు దాదాపు నాలుగు గంటలపాటు హైవేను దిగ్బంధించారు.