ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు. రెండు రోజుల తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘజియాబాద్‌లోని మోదినగర్ ప్రాంతంలో నివసిస్తున్న మోహిత్ త్యాగి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన బలవన్మరణానికి భార్య, ఆమె బంధువులు కారణమని ఆరోపించాడు. వారందరూ తనపై వేధింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. మోహిత్ భార్య ప్రియాంక త్యాగి, ఆమె సోదరుడు పునీత్ త్యాగి, వదిన నీతు త్యాగి, బంధువులు అనిల్, విశేష్ త్యాగిలపై మోదినగర్ పోలీస్ స్టేషన్‌లో మోహిత్ కుటుంబం ఫిర్యాదు చేసింది. మోహిత్ మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 10, 2020న సంభాల్ జిల్లాకు చెందిన ప్రియాంక అనే మహిళను మోహిత్ వివాహం చేసుకున్నాడు. ఇది మోహిత్ కు రెండవ వివాహం. ఈ జంటకు అక్టోబర్ 2021లో కుమారుడు జన్మించాడు. వివాహం జరిగిన కొన్ని నెలల్లోనే వారి సంబంధం క్షీణించడం ప్రారంభమైంది. అతడిని దుర్భాషలాడడం, బెదిరింపులకు దిగడం, మానసిక వేధింపులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 15న విషం తాగడానికి కొద్దిసేపటి ముందు వాట్సాప్‌లో అనేక మంది స్నేహితులు, బంధువులతో మోహిత్ ఆత్మహత్య లేఖ పంచుకున్నాడు.
2024 ఆగస్టులో మోహిత్ తల్లి బ్లడ్ క్యాన్సర్ కారణంగా మరణించిన తరువాత మోహిత్, ప్రియాంక మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తన తల్లి మరణించిన మూడు నెలల తర్వాత, ప్రియాంక తన సోదరుడు, మరొక గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ తీసుకుని వెళ్లారు. వాటి విలువ రూ. 12 నుండి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. అలాగే కుటుంబ లాకర్‌లో నిల్వ చేసిన నగదును ఎత్తుకెళ్లిందని మోహిత్ ఆరోపించాడు. ఆ సమయంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని మోహిత్ కుటుంబం పేర్కొంది.
ఏప్రిల్ 15న, సంభాల్‌లోని చౌడా పోలీస్ స్టేషన్ నుండి మోహిత్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో అతని భార్య అతడిపై చేసిన ఫిర్యాదు గురించి అని తెలిసింది. బాధతో అతడు కొద్దిసేపటికే తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఆత్మహత్య చేసుకోబోతున్నానని మెసేజీ పంపాడు. బాధ్యుల పేర్లను కూడా ప్రస్తావించాడు. విషం తాగాక మోదీనగర్‌లోని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి మరింత దిగజారి రెండు రోజుల తర్వాత మరణించాడు. ప్రియాంక ప్రవర్తనను మార్చడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తూనే వచ్చానని, ఎలాంటి మార్పు రాకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.