నోయిడా: టెక్ సపోర్ట్, ట్యాక్స్ రిటర్న్స్ పేరుతో విదేశీయులను 170 కోట్ల రూపాయలు మోసగించిన నోయిడాకు చెందిన సైబర్ నేరగాళ్ల ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) శుక్రవారం ఛేదించింది. కాల్ సెంటర్ లో పని చేస్తున్న ముఠాలోని 10 మంది సభ్యులను శుక్రవారం మధ్యాహ్నం నోయిడాలోని సెక్టార్ 59లో అరెస్టు చేసినట్లు STF అధికారులు తెలిపారు. "యుఎస్, కెనడా, యుకె, లెబనాన్, హాంకాంగ్ మొదలైన దేశాలలో నివసిస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి ముఠా అధునాతన సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (UP STF) విశాల్ విక్రమ్ సింగ్ తెలిపారు.
ముఠా వద్ద నుంచి 70కి పైగా డెస్క్‌టాప్ కంప్యూటర్లు, పలు మొబైల్ ఫోన్‌లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్ష చేయనున్నట్లు అధికారులు తెలిపారు. "ఇప్పటి వరకు అందుకున్న బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల విశ్లేషణ ప్రకారం, ఈ ముఠా సుమారు ₹ 170 కోట్లను మోసం చేసింది" అని అధికారులు చెప్పారు. ముఠాకు చెందిన ఇతర బ్యాంకు ఖాతాల గురించి సమాచారం అందుకున్నారు. ఆ ఖాతాలను స్తంభింపజేసి, నేరస్థులపై చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని అధికారి తెలిపారు. ఈ ముఠా సూత్రధారులను కరణ్ మోహన్, వినోద్ సింగ్‌లుగా గుర్తించారు.