ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక దుకాణం బయట ఉన్న బల్బును పోలీసు దొంగిలించడంతో ఓ పోలీసును సస్పెండ్ చేశారు. ప్రయాగ్ రాజ్ లో కొద్దిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాజేశ్ వర్మ అనే పోలీస్ కానిస్టేబుల్ కు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్.. మెల్లగా నడుచుకుంటూ ఓ షాపు వద్దకు వెళ్లి.. అలా.. ఇలా తిరుగుతూ నేరుగా విద్యుత్ బల్బు ఉన్న చోటుకు వెళ్లాడు. బల్బు తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దుకాణం ముందు బల్బు లేకపోవడం గమనించిన యజమాని.. సీసీ కెమెరా ఫుటేజీని గమనించాడు. కానిస్టేబుల్ బల్బు ఎత్తుకుపోయిన విషయాన్ని పలువురికి చెప్పాడు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. తాను నైట్ డ్యూటీలో ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండటంతో అక్కడ పెట్టేందుకే ఈ దుకాణం బయటి నుంచి బల్బు తీసుకెళ్లానని కానిస్టేబుల్ చెప్పాడు. ఈ ఘటన అక్టోబర్ 6న జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.