మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే క్రమంలో నిందితులు ఎన్నో తప్పుడు దారులను వెతుకుతూ ఉన్నారు. అలాంటిదే క్యాప్సుల్స్ ను మింగడం కూడా..! 887 గ్రాముల హెరాయిన్‌తో కూడిన 126 క్యాప్సూల్స్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఉగాండా మహిళను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఏప్రిల్ 14న దోహా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన మహిళా ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. తదనంతరం, ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు, అక్కడ ఆమె శరీరం లోపల కొన్ని పదార్థాలు ఉన్నట్లు కనుగొనబడింది. "వైద్య ప్రక్రియలో మొత్తం 887 గ్రాముల ఆఫ్-వైట్ కలర్ పదార్థాన్ని కలిగి ఉన్న 126 క్యాప్సూల్స్ రికవరీ చేయబడ్డాయి, ఇదంతా హెరాయిన్ అని గుర్తించారు. ఈ హెరాయిన్ అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ. 6.65 కోట్లుగా ఉంది" అని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 సెక్షన్ 43(బి) కింద ఆమెని అరెస్టు చేయగా, ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.