టోల్ కట్టమన్నారు.. కత్తులు బయటకు వచ్చాయి..
Udhamsinghnagar Toll Tax. టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించకుండా వెళ్లిపోవాలని చూశారు.. అయితే టోల్ సిబ్బంది
By Medi Samrat Published on 8 Feb 2022 3:18 PM ISTటోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించకుండా వెళ్లిపోవాలని చూశారు.. అయితే టోల్ సిబ్బంది అడ్డుకోవడంతో పెద్ద దుమారమే చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో కారుకు టోల్ కట్టమని అడగ్గా.. కొందరు వ్యక్తులు కత్తులు తీసుకుని టోల్ సిబ్బందిపై దూసుకువచ్చారు. దీంతో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
జిల్లాలోని కిచ్చాలోని పించ్ డియోరియా టోల్ ప్లాజా వద్ద సోమవారం తెల్లవారుజామున రైతులమని చెబుతూ టోల్ కట్టకుండా మొండికేశారు. మాటా మాటా పెరగడంతో కారులో ఉన్నవారు ఉద్యోగులపై కత్తులు దూశారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. కారు రుద్రాపూర్ నుంచి కిచ్చా వైపు వెళ్తోంది. ఉద్యోగులు అజయ్, అరుణ్‌లకు గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా పోలీసులు వారిని విడిచిపెట్టారు.
ఈ ఘటనలో టోల్ మేనేజర్ రాహుల్ శర్మ పోలీసులకు నోటీసు ఇచ్చారు. రైతుల ఉద్యమం నాటి నుంచి టోల్ చెల్లించడం లేదంటూ నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఉదయం ఫాస్ట్ ట్యాగ్ లేని కారు వచ్చిందని టోల్ ప్లాజా పించ్ డియోరియా మేనేజర్ రాహుల్ శర్మ తెలిపారు. టోల్ కోసం అడగడంతో, వారు సిబ్బందిపై గొడవకు దిగారు. ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.