మేడ్చల్‌లోని కొంపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం అతివేగంగా నడుపుతున్న కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాధితులను దుండిగల్‌లోని బహదూర్‌పల్లిలో నివాసముండే బి.సాయి కిషోర్ (20), అతని స్నేహితుడు ఎస్.సాయి తేజ (19)గా గుర్తించారు. ఇద్దరూ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సాయి కిషోర్ మోటార్‌సైకిల్‌పై తమ ఇళ్ల నుండి బయలుదేరి మేడ్చల్‌కు వెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కొంపల్లి వైపు తిరిగి వస్తుండగా 1.30 గంటలకు ఏజీఎస్ వెంచర్ సమీపంలోకి రాగానే ఎదురుగా కొంపల్లి నుంచి వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు మీద ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి ఎదురుగా వస్తోన్న రెండు బైక్‌లను, ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సాయి తేజకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, సాయికిషోర్ రక్తస్రావంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయికిషోర్ బైక్ వెనుక మరో బైక్‌పై ఉన్న దంపతులు, వారి కుమార్తె, ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.