అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి

Two children of a family die suspiciously in Srikalahasti. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు

By Medi Samrat  Published on  18 Feb 2022 6:16 AM GMT
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి

శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం రాచగున్నేరికి వచ్చారు. వీరికి కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్ కుమార్ దాస్ (2) ఉన్నారు. రమేష్ గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య ఇంట్లోనే ఉంటోంది.

రమేష్ బుధవారం విధులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హీనాకుమార్ అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు కుమారుడిని పక్క ఇంట్లో వదిలి కూతురిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదిలాఉండగా కూతురి మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. కుమారుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతూ రోషన్ కుమార్ దాస్ కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కేసు నమోదు చేసి పిల్లల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించకుండానే ఏరియా ఆస్పత్రి వైద్యులు చిన్నారులకు మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అయితే పోలీసుల ఒత్తిడి మేరకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు.


Next Story
Share it