పార‌తో సైకో వీరంగం.. ఇద్ద‌రు కూతుర్ల‌తో స‌హా ఐదుగురిని చంపాడు

Tripura man kills 5 including children with shovel. త్రిపురలోని ఖోవైలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి

By Medi Samrat  Published on  27 Nov 2021 8:40 AM GMT
పార‌తో సైకో వీరంగం.. ఇద్ద‌రు కూతుర్ల‌తో స‌హా ఐదుగురిని చంపాడు

త్రిపురలోని ఖోవైలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డాడు. అనేక మందిపై పారతో దాడి చేశాడు. ఈ దాడిలో అతని ఇద్దరు పిల్లలు, ఒక పోలీసు అధికారితో సహా ఐదుగురిని చంపాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న ప్రదీప్ దేవరాయ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. చుట్టుప‌క్క‌ల జ‌నాల‌తో కూడా మాట్లాడటం మానేశాడు. అతను శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా హింసాత్మకంగా మారి తన కుటుంబంపై ఆయుధంతో దాడి చేసి తన ఇద్దరు కుమార్తెలు, అన్నయ్యను చంపాడు. ఈ దాడిలో అతని భార్య మీనా దాడిలో తీవ్రంగా గాయపడింది.

ఆపై దేవరాయ్ తన ఇంటి నుండి బయటికి వచ్చి.. ఇరుగుపొరుగు ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్ళాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇరుగుపొరుగు జ‌నాలు తమ ఇళ్లకు తాళం వేసుకున్నారు. కొందరు ధైర్యం చేసి బయటికి వచ్చి పార పట్టుకుని అరాచ‌కం సృష్టిస్తున్న‌ దేవ్రాయ్‌ను తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్ర‌మంలోనే దేవ్‌రాయ్ అటుగా వస్తున్న ఆటోరిక్షాపై క‌న్నేశాడు. ఆటోరిక్షాలో కృష్ణ దాస్‌, ఆయన కుమారుడు కరణ్‌బీర్ వ‌స్తుండ‌గా.. దేవ్రాయ్ పారతో తండ్రి, కొడుకుల‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా.. కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల స‌మాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం దేవరాయ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే.. వారిపై కూడా దేవరాయ్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన‌ ఖోవై పోలీస్ స్టేషన్ అధికారి సత్యజిత్ మాలిక్ మృతి చెందాడు.

ఘ‌ట‌న‌పై త్రిపుర డిజిపి విఎస్ యాదవ్ మాట్లాడుతూ.. ఓ మేస్త్రీ సైకోగా మారి తన కుటుంబ సభ్యులతో పాటు ప‌లువురిపై దాడి చేయడంతో ఒక పోలీసు అధికారితో సహా ఐదుగురు మరణించారని తెలిపారు. సైకో దాడిలో అతని ఇద్దరు కుమార్తెలు, అతని అన్నయ్య, ఒక ప్ర‌యాణికుడు, ఖోవై పోలీస్ స్టేషన్‌ అధికారి మరణించారని డిజిపి వివ‌రాలు వెల్ల‌డించారు. దాడికి పాల్ప‌డ్డ ప్రదీప్ దేవరాయ్‌ను అరెస్టు చేశామ‌ని.. దేవ్‌రాయ్‌ దాడిలో గాయపడ్డ పలువురిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని.. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.


Next Story
Share it