మధ్యప్రదేశ్‌లో అమానుషం.. పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..

Top caste elders' restrictions on a woman in Madhya Pradesh.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్దింటి వ్యక్తిని మహిళ ప్రేమించి వివాహం చేసుకున్నందుకు.. అష్టకష్టాలు పడుతోంది.

By అంజి  Published on  19 Dec 2021 11:42 AM IST
మధ్యప్రదేశ్‌లో అమానుషం.. పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్దింటి వ్యక్తిని మహిళ ప్రేమించి వివాహం చేసుకున్నందుకు.. అష్టకష్టాలు పడుతోంది. ఆలయంలోకి రావొద్దు, నల్లా నీళ్లని పట్టుకోవద్దని ఆ మహిళపై గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారు. ఈ ఘటన హర్దా నగర పరిధిలో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే ఓ దళిత మహిళ.. ఓ పెద్దింటి వ్యక్తిని ప్రేమించింది. నాలుగు సంవత్సరాల కిందట ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిపై అగ్ర కులాలకు చెందిన కొందరు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి జరిగినప్పటి నుండి తమను వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత మహిళ తెలిపారు. కులం పేరుతో దూషణలు చేస్తూ మానసికంగా చాలా బాధపెడుతున్నారని మహిళ చెప్పారు. ఇంటి దగ్గర ఉన్న నల్లా నీళ్లని కూడా పట్టుకోనివ్వడం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డికి వెళ్లితే రాళ్లు విసురుతున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంటి సమీపంలోని గుడికి కూడా రానివ్వడం లేదన్నారు. గుడిలోని పూజారి సైతం తన కుమార్తెలను పలుమార్లు కొట్టాడని, అలాగే గుడిలో నుండి బయటకు తోసేశాడని చెప్పారు. పూజారి కొట్టిన దెబ్బలకు తన కూతురు పెదవి పగిలిపోయిందన్నారు. దేవుడి ప్రసాదం కూడా గుడి బయటే ఉండి తీసుకోవాలని చెప్పేవాడని చెప్పారు. అయితే తనకు జరుగుతున్న అన్యాయంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత మహిళ వాపోయారు.

Next Story