ముగ్గురు అక్కా చెల్లెల్లు రోడ్డు మీదకు వచ్చి.. యువకుడిని చితక్కొట్టారు
Three sisters took revenge for beating their brother. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు సోదరీమణులు స్కూటీపై వెళ్లి ఒక యువకుడిని నడిరోడ్డుపై కర్రలు, రెంచ్‌లతో కొట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే నగర ఎస్పీ విచారణ జరిపి చర్యలకు ఆదేశించారు.
దెబ్బలు తిన్న యువకుడి పేరు నీరజ్ నిషాద్. మత్బర్‌గంజ్‌లోని గ్యారేజీలో పనిచేస్తున్నాడు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, అతను తన మోటార్ సైకిల్‌పై సిధారి వైపు నుండి వస్తున్నాడు. అదే సమయంలో రహదారిపై నిలబడి ఉన్న ఎద్దు అతనిపై దాడి చేసింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, అతను సైక్లిస్ట్‌ను ఢీకొని పడిపోయాడు. సైక్లిస్ట్ కు, నీరజ్ నిషాద్ కు మధ్య గొడవ చోటు చేసుకోగా.. కొంత సమయం తరువాత వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ వారి వారి ప్రాంతాలకు వెళ్లారు. సైక్లిస్ట్ ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు. విషయం విన్న అతని ముగ్గురు సోదరీమణులు ఎంతో కోపంగా ఉన్నారు.
ఆ తర్వాత ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్కూటీపై ఎక్కి నీరజ్ నిషాద్ కోసం బయల్దేరారు. మత్బర్‌గంజ్ ప్రాంతంలో పని చేస్తున్న నీరజ్ ను కలిశారు. అప్పుడు ముగ్గురు సోదరీమణులు అతనిని దుర్భాషలాడుతూ కర్రలు, రెంచ్‌లతో కొట్టడం ప్రారంభించారు. ఈ తతంగమంతా వీడియో తీశారు. చుట్టుపక్కల వారు అడ్డుకుని.. అక్కడి నుండి ఆ యువతులను పంపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది. బాలికలు తనను తీవ్ర పదజాలంతో దూషించారని బాధిత యువకుడు ఆరోపించాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో SHO కొత్వాలి విచారిస్తున్నారని, విచారణ తర్వాత దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిటీ అజంగర్ చెప్పారు.