ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సామూహిక అత్యాచార ఘటన సంచలనం రేపింది. బురారీలో మహిళను ఇంట్లో బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇంటికి బయటి నుంచి తాళం వేసి అత్యాచారానికి పాల్పడి పారిపోయారని బాధితురాలు ఆరోపించింది. అక్టోబర్ 29న బురారీ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిపై బ్లాక్ మెయిల్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
దానిష్ అనే వ్యక్తి కేసు ఉపసంహరణ కోసం ఒత్తిడి తీసుకుని వచ్చారని బాధితురాలు తెలిపింది. తనపై బలవంతంగా సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. గురువారం మార్కెట్ నుంచి కూరగాయలతో తిరిగి వచ్చానని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఇంటికి చేరుకోగానే, ముగ్గురు వ్యక్తులు వెనుక నుండి తోసారు. తర్వాత నోరు నొక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారం చేసిన తర్వాత, నిందితులు తలుపు బయట నుండి తాళం వేసి పారిపోయారు. ఎలాగోలా బాధితురాలు చేతులకు కట్లను విదిలించుకుంది. తన మొబైల్ నుంచి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు బయట లాక్ వేసి ఉండటాన్ని గమనించారు. పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా కాళ్లు చేతులు కట్టి వివస్త్రగా పడి ఉన్న మహిళ కనిపించింది. పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించిన అనంతరం గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.